Back to Lyrics
Rangamarthanda

Rangamarthanda

2023 · 2 songs

నేనొక  నటుడ్ని
చంకీల  బట్టలేసుకొని  అట్టకిరీటం  పెట్టుకొని
చెక్క  కత్తి  పట్టుకుని  కాగితాల  పూల  వర్షంలో
కీలుగుర్రంపై  స్వారీ  చేసే  చక్రవర్తిని  నేను
కాలాన్ని  బంధించి  శాసించే  నియంతని  నేను

నేనొక  నటుడ్ని
నాది  కాని  జీవితాలకు  జీవం  పోసే  నటుడ్ని
నేను  కాని  పాత్రల  కోసం  వెతికే  విటుడ్ని
వేషం  కడితే  అన్ని  మతాల  దేవుడ్ని
వేషం  తీస్తే  ఎవ్వరికీ  కాని  జీవుడ్ని

నేనొక  నటుడ్ని
నవ్విస్తాను  ఏడిపిస్తాను  
ఆలోచనల  సంద్రంలో  ముంచేస్తాను
హరివిల్లుకు  ఇంకో  రెండు  రంగులు  వేసి  
నవరసాలు  మీకిస్తాను
నేను  మాత్రం  నలుపు  తెలుపుల  
గందరగోళంలో  బ్రతుకుతుంటాను

నేనొక  నటుడ్ని
జగానికి  జన్మిస్తాను
సగానికి  జీవిస్తాను
యుగాలకి  మరణిస్తాను
పోయినా  బ్రతికుంటాను

నేనొక  నటుడ్ని
లేనిది  ఉన్నట్టు  చూపే  కనికట్టుగాడ్ని
ఉన్నది  లేనట్టు  చేసే  టక్కుటమారపోడ్ని
ఉన్నదంతా  నేనే  అనుకునే  అహం  బ్రహ్మస్మిని
అసలు  ఉన్నానో  లేనో  తెలియని  ఆఖరి  మనిషిని

నేనొక  నటుడ్ని
గతానికి  వారధి  నేను
వర్తమాన  సారధి  నేను
రాబోయే  కాలంలో  రాయబోయే  చరిత్ర  నేను
పూట  పూటకి  రూపం  మార్చుకునే  అరుదైన  జీవిని  నేను

నేనొక  నటుడ్ని
పిడుగుల  కంఠాన్ని  నేను
అడుగుల  సింహాన్ని  నేను
నరంనరం  నాట్యం  ఆడే  నటరాజ  రూపాన్ని  నేను
ప్రపంచ  రంగస్థలంలో  పిడికెడు  మట్టిని  నేను
ప్రఛండంగా  ప్రకాశించు  రంగమార్తాండున్ని  నేను

నేనొక  నటుడ్ని
అసలు  ముఖం  పోగొట్టుకున్న  అమాయకుడ్ని
కానీ  తొమ్మిది  తలలు  ఉన్న  నటరాణుడ్ని
నింగీనేల  రెండడుగులైతే
మూడో  పాదం  మీ  మనసులపై  మోపే  వామనుడ్ని
మీ  అంచనాలు  దాటే  ఆజానుబాహున్ని
సంచలనాలు  సృష్టించే  మరో  కొత్త  దేవుడ్ని

నేనొక  నటుడ్ని
అప్సరసల  ఇంద్రుడ్ని
అందుబాటు  చంద్రుడ్ని
అభిమానుల  దాసుడ్ని
అందరికీ  ఆప్తుడ్ని

చప్పట్లను  భోంచేస్తూ
ఈలలను  శ్వాసిస్తూ
అణుక్షణం  జీవించే
అల్ప  సంతోషిని  నేను

మహా  అదృష్టవంతుడిని  నేను
తీర్చలేని  రుణమేదో  తీర్చాలని  పరితపించే  
సగటు  కళాకారుడ్ని  నేను
ఆఖరి  శ్వాస  వరకు  నటనే  ఆశ  నాకు
నటుడిగా  నన్ను  ఇష్టపడ్డందుకు  
శతకోటి  నమస్సులు  మీకు

Community

Like, share, and discuss

to start a discussion.